రాష్ట్రీయ వార్తలు



నేటి నుండి నిరుద్యోగ భృతి 2 వేలు : సిఎం చంద్రబాబు ట్వీట్‌

అమరావతి : ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతిని నేటి (శనివారం) నుండి రూ.2 వేలకు రెట్టింపు చేసినట్లు ఎపి సిఎం చంద్రబాబు ట్విట్టర్‌లో ప్రకటించారు. శనివారం ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ముందుగా భారత పైలట్‌, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విడుదలపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘దేశం కోసం పోరాడుతూ, శత్రు దళాలకు చిక్కి కూడా ఎంతో గంభీరంగా, నిబ్బరంగా పురుషోత్తముడిలా ధైర్యంగా నిలబడ్డ భారతీయ వాయుసేన కెప్టెన్‌ అభినందన్‌ సాహసం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అభినందన్‌ స్వదేశానికి క్షేమంగా చేరుకోవటం ఎంతో ఆనందంగా ఉందని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. యువనేస్తం పథకానికి సంబంధించి..

తెలుగు భాషామతల్లి ముద్దు బిడ్డ ద్వానా శాస్త్రి ఇక లేరు

తెలుగు భాషామతల్లి ముద్దు బిడ్డ ద్వానా శాస్త్రి ఇక లేరు
ఆయన తెలుగు భాషామతల్లికి సాహిత్య సుమ మాలలు వేశారు. అద్భుతమైన తన రచనలతో తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి వెలుగులద్దిన ఆయన సాహితీ కృషి నిరుపమానమైనది. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆ మహానుభావుడు ద్వానా శాస్త్రి తెలుగు సాహిత్య లోకాన్ని శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయారు. సోమవారం అర్థరాత్రి ఆయన తిరిగి రాని లోకాలకు చేరిపోయారు.
ద్వానా శాస్త్రిగా పేరుగాంచిన ఆయన పూర్తి పేరు ద్వాదశి నారాయణ శాస్త్రి. ఆయన వయస్సు 72 ఏళ్లు.ఆయన తెలుగు సాహిత్య చరిత్ర వంటి పలు గ్రంథాలు రచించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆయన రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి. 1970లో రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టిన ద్వానాశాస్త్రి విమర్శనా సాహిత్యానికి పెద్దపీట వేస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. వివిధ పత్రికలు, పుస్తకాల్లో వేలాది వ్యాసాలూ రాశారు.
సమాధిలో స్వగతాలు-వచ న కవిత, వాఙ్మయ లహరి- వ్యాససంపుటి, సాహిత్య సాహి త్యం – వ్యాస సంపుటి, మారేపల్లి రామచంద్ర కవితా సమీక్ష-ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం, ద్రావిడ సాహిత్య సేతువువ్యాస ద్వాదశి, వ్యాస సంపుటి అక్షర చిత్రాలు, అరుదైన ఛాయాచిత్రాలు సాహిత్య సంస్థలు – పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసం, ఆం ధ్ర సాహిత్యం, మన తెలుగు తెలుసుకుందాం, ద్వానా కవితలు, శతజయంతి సాహితీమూర్తులు సంపాదకత్వం,తెలుగు సాహిత్య చరిత్ర, నానీలలో సినారె, సినారె కవిత్వంలో ఉక్తులు, సూక్తులు వంటి పలు గ్రంథాలను ఆయన వెలువరించారు.తెలుగు సాహితీ వినీలాకాశంలో వెలుగు వెలిగి, తెలుగు భాషా ప్రియులకు ఎంతో ఉపయుక్తమైన గ్రంథాలను రచించిన సాహితీమూర్తి లేని లోటు తెలుగు భాషామతల్లి కి తీరని లోటు.

నూతన ఆరోగ్య పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. వాళ్లకు మందులు ఫ్రీ
http://dhunt.in/5wMwx?s=a&ss=wsp
Source : “ఆంధ్రజ్యోతి” via Dailyhunt

 టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM 

1. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. గత డిసెంబరులో ఎన్నికల గుర్తు విషయంపై సీఎం కేసీఆర్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కారు గుర్తును పోలిన గుర్తులు, కారు గుర్తు బోల్డ్ చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం కారు గుర్తు బోల్డ్‌ చేయడంపై సూచనలు కోరింది. దీంతో కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ మార్పు చేసిన కారు గుర్తుని ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్‌ మీడియాతో మాట్లాడుతూ… ఈవీఎంలలో కారు గుర్తు సరిగా కనిపించక వృద్ధులు, కంటి సమస్య ఉన్నవారు ఇబ్బంది పడ్డారని తెలిపారు.

2. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చెప్పిన దానికంటే ఎక్కువే చేశామని వివరించారు. రైతులకు రూ.1.5 లక్షలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఈ మేరకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ‘‘గడిచిన నాలుగున్నరేళ్లలో 295 హామీలను అమలు చేశాం. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు కూడా అమలు చేశాం.2029 నాటికి ఏపీ లక్ష కోట్ల జీడీపీకి చేరాలన్నదే నా లక్ష్యం’’ అని చంద్రబాబు వివరించారు.

3. ప్రపంచ బ్యాడ్మింటన్‌షిప్‌, ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకున్న తెలుగుతేజం పీవీ సింధు ఇప్పుడు మరో జాక్‌పాట్ కొట్టేసింది. చైనీస్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ ‘లీ నింగ్‌’ కంపెనీతో రూ. 50 కోట్ల విలువైన స్పాన్సర్‌షిప్‌ ఒప్పందంపై ఆమె సంతకం చేసింది. ఈ ఒప్పందం నాలుగేళ్లపాటు కొనసాగనుంది. ‘‘సింధూతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రపంచ బ్యాడ్మింటన్‌ చరిత్రలోనే చాలా పెద్దది. స్పాన్సర్‌షిప్‌, క్రీడాసామగ్రితో కలిపి దీని విలువ రూ. 50 కోట్లు’’ అని సన్‌లైట్‌ స్పోర్ట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌, లీ నింగ్ ఇండియా పార్టనర్‌ మహేందర్‌ కపూర్‌ ఓ జాతీయ మీడియాకు శుక్రవారం తెలిపారు.

4. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కారుపై దాడి జరిగింది. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరు ఆందోళనకారులు కేజ్రీవాల్‌ కారుపై కర్రలతో దాడి చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు కేజ్రీవాల్‌ శుక్రవారం సాయంత్రం నరేలా ప్రాంతానికి బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో దాదాపు 100 మంది ఆందోళనకారులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కర్రలతో కారుపై దాడి చేసినట్లు సీఎంవో కార్యాలయం అధికారులు తెలిపారు. భాజపా కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు ఆప్‌ వర్గాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను భారతీయ జనతాపార్టీ కొట్టిపారేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

5. ఏపీ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకరించారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఎన్నికల కోడ్‌ సమీపిస్తున్నందున వివిధ వర్గాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకునే దిశగా కేబినెట్‌ కసరత్తు చేస్తోంది. 

6. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీలపై భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌, జైన్‌పూర్‌ జిల్లాల్లో పర్యటించిన ఆయన ‘బీఎస్పీ-ఎస్పీ కూటమిని చూసి భాజపా కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో 50 శాతం ఓట్లను రాబట్టేందుకు భాజపా సిద్ధంగా ఉంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భాజపా 74 స్థానాల్లో విజయం సాధిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. 

7. జమ్ము-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భారీ హిమపాతం చోటుచేసుకొని 10మంది పోలీసులు గల్లంతైన ఘటనలో ముగ్గుర్ని వెలికితీశారు. శ్రీనగర్‌-జమ్ము జాతీయ రహదారికి సమీపంలోని జవహర్‌ సొరంగ ఉత్తర ద్వారం వద్ద గురువారం అకస్మాత్తుగా మంచు చరియలు విరిగిపడి గురువారం సాయంత్రం భారీ హిమపాతం చోటుచేసుకుంది. దీంతో అక్కడే పోలీస్‌ పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న10 మంది పోలీసులు మంచులో కూరుకుపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టి, శుక్రవారం ముగ్గురు పోలీసులను వెలికితీశాయి. మిగిలిన ఏడుగురినీ రక్షించేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. 

8. వండిన ఆహారాన్ని వృథా కాకుండా ఎక్కువ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు ముంబయి విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రకటించారు. ఎలాంటి  ప్రిజర్వేటివ్స్‌ అవసరం లేకుండానే ఈ ఘనత సాధించినట్లు విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ వైశాలి బొంబలే పేర్కొన్నారు. ఆరేళ్లుగా చేసిన పరిశోధనల్లో ఇడ్లీ, ఉప్మా, వైట్‌ ధోక్లాలను మూడు సంవత్సరాలపాటు నిల్వ ఉంచవచ్చని రుజువైందని తెలిపారు.  ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు విభిన్న పరిస్థితుల్లో సేవలందించే సాయుధ దళాలకు, ఖగోళ పరిశోధనలు చేసే వారికి తమ పరిశోధన ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత కూడా తాము నిల్వ చేసిన ఇడ్లీ తాజాగా ఉందని.. రుచిలోనూ ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.

9. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ 2013 అల్లర్ల కేసులో దోషులుగా తేలిన ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు స్థానిక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిని నిన్న దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. వారికి నేడు న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. దోషులైన ముజమ్మిల్‌, ముజస్సిమ్‌, ఫర్ఖాన్‌, నదీమ్‌, జహంగీర్‌, అఫ్జల్‌, ఇక్బాల్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.  

10. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తమ మైనపు విగ్రహాలకు చోటు దక్కాలని చాలా మంది ప్రముఖులు కోరుకుంటారు. అయితే ప్రియాంకకు మాత్రం ఆ గౌరవం చాలా ఎక్కువగా దక్కింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. న్యూయార్క్‌, లండన్‌, సిడ్నీ, ఆసియాలోని నాలుగు టుస్సాడ్స్‌ మ్యూజియాల్లోనూ ప్రియాంక మైనపు విగ్రహాలను ఉంచనున్నారు. ఇప్పటికే న్యూయార్క్‌ మ్యూజియంలో ఆ పని పూర్తికాగా, త్వరలో మిగతా వాటిలోనూ ఈ భామ దర్శనమీయనున్నారు. గురువారం న్యూయార్క్‌లో ఆవిష్కరించిన విగ్రహంతో ప్రియాంక ఫొటో దిగి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. 

టాప్‌10 న్యూస్‌ @ 5 PM

1. అవినీతికి పాల్పడడమే కాంగ్రెస్‌ పార్టీ అజెండా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అవినీతికి పాల్పడ్డవారికి ఆ పార్టీ సాయం చేస్తోందని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని అంటోంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యారోగ్య పథకాలు ఈ రాష్ట్రానికి వద్దని చెబుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేం కూడా వారికి అభినందనలు తెలిపాం. రాష్ట్రాభివృద్ధి కోసం వారు కూడా కొన్ని మంచి పనులు చేస్తారని అనుకున్నాం. కానీ, కేంద్ర సర్కారు అందిస్తున్న పథకాల ప్రయోజనాలు అందకుండా చేయడమే వారి పనిగా మారింది’’ అని మోదీ విమర్శించారు.

2. రాహుల్‌ మతి స్థిమితం కోల్పోయారని భాజపా ఆరోపించింది. రఫేల్‌ విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్‌ చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. అసత్యాలు పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజాలు కాబోవని స్పష్టం చేసింది. ‘‘రఫేల్‌పై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే పూర్తి సమాచారాన్ని ఇస్తూ వివరణ ఇచ్చారు. రాహుల్‌ మాత్రం కావాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ మోదీని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన రఫేల్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’’ అని భాజపా నేతలు మండిపడ్డారు.

3. ప్రజాసేవలో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించామని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నూటికి 80 శాతం మంది తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్నారని ఆయన స్పష్టంచేశారు. నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ప్రధాని మోదీ పార్లమెంట్‌లో దారుణంగా మాట్లాడుతూ రాష్ట్రానికి తగిలిన గాయంపై కారం చల్లుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మోదీ మోసాన్ని ఎంపీ జయదేవ్ సూటిగా ఎండగట్టగలిగారన్నారు. రాగ ద్వేషాలకు అతీతంగా, వాస్తవాలకు దగ్గరగా ఎన్నికలకు వెళ్తున్నామని చంద్రబాబు నేతలకు వివరించారు.

4. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత కేసులో శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులకు తెలంగాణ హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కోర్టు తీర్పును అమలు పరచకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టుకు హాజరు కావాలని శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌ రావులను ఆదేశించింది. 

5. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-గుంటూరు కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం మొండిచేయి చూపింది. రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాల్సిందిగా 2017-18 బడ్జెట్‌లో ప్రతిపాదించగా.. దీనిపై కేంద్రం ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా నీతి ఆయోగ్‌ చెప్పిందంటూ రైల్వే లైన్‌ పనుల ఆమోదానికి సంబంధించిన దస్త్రాలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. రైల్వేలైన్‌ ఏర్పాటుపై రాజ్యసభలో తెదేపా ఎంపీ రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ, ఉపరితల రవాణా శాఖ, పట్టణాభివృద్ధి శాఖల మధ్య సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాలేదని.. అప్పటి వరకు రైల్వే లైన్‌కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని గోయల్‌ సభలో వెల్లడించారు.

6. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన అనిల్ అనే న్యాయవాది ఆత్మహత్యకు యత్నించారు. నంద్యాల కోర్టు ఆవరణలో ఆయన పురుగు మందు తాగారు. న్యాయవాది తన నుదుటి పై ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని  రాసుకున్నారు. సూసైడ్‌నోట్‌లో ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను వివరిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనిల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

7. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య ప్రీ-వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్‌ వనగమూడిని సౌందర్య వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే రిసెప్షన్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేశారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపం వేడుకకు వేదికైంది. కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

8. దలాల్‌ స్ట్రీట్‌ బేర్‌మంది. ఆద్యంతం అమ్మకాల ఒత్తిడితో కుదేలైంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా సాగాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. దీనికి తోడు టాటామోటార్స్‌ లాంటి దిగ్గజ షేర్లు భారీగా పడిపోవడం మార్కెట్‌ను కుదిపేసింది. ఫలితంగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 11వేల మార్క్‌ను కోల్పోయింది. మార్కెట్‌ ఆరంభం నుంచే సూచీల నష్టకష్టాలు మొదలయ్యాయి. 

9. టీమిండియా లెక్క సరి చేసింది. తొలి మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. రోహిత్‌ శర్మ (50), రిషభ్ పంత్‌(40నాటౌట్‌), ధావన్‌ (30)రాణించడంతో లక్ష్యాన్ని అలవోకగా చేరుకుంది. మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయతీరాలకు చేరింది. కివీస్‌ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌, ఇష్‌ సోధీ, డేరిల్‌ మిచెల్‌ తలో వికెట్‌ తీశారు.

10. ఈ నెల 21న తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 7 నుంచి ఐసెట్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 6న ‌ దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు. మే 9న హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 23, 24 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. 29న ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తామని, జూన్‌ 13న ఫలితాలు వెల్లడించనున్నట్లు పాపిరెడ్డి చెప్పారు. 67 కేంద్రాల్లో ఐసెట్‌ పరీక్ష ఉంటుందని, తెలంగాణలో 12 ప్రాంతీయ కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లో 4 ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

టాప్‌ 10 న్యూస్‌ – 1 PM

1. ప్రవాసాంధ్రుడు, కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరాం హత్య ఘటనలో మరోసారి కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 8 సెక్షన్ల కింద కేసును నమోదు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. జయరాం భార్య పద్మశ్రీ పలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

2. రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్‌ ఒప్పందం అంశంపై మరోసారి విమర్శల దాడికి దిగారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతరంగా చర్చలు జరిపిందని తాజా నివేదికలో తేలిందన్నారు. 

3. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని జేడీఎస్‌ నేత, కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడటం లేదని ఆయన చెప్పారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కుమారస్వామి మండిపడ్డారు. ఓ వైపు ప్రధాని మోదీ సత్యాలు వల్లె వేస్తూ‌.. మరో వైపు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

4. భాజపా కర్ణాటక అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప మధ్యవర్తుల ద్వారా జేడీఎస్‌ ఎమ్మెల్యేకు డబ్బు ఎర వేస్తున్నట్లుగా ఉన్న ఆడియో టేపును కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం విడుదల చేశారు. కాగా ఈ టేపుపై యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా అబద్ధమని, తనను ఇరికించాలని కావాలనే ఈ వీడియోను సృష్టించారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.

5. ప్రజాసేవలో డిస్టింక్షన్ లో ఉతీర్ణత సాధించామని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నూటికి 80 శాతం మంది తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్నారని ఆయన స్పష్టంచేశారు. నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ప్రధాని మోదీ పార్లమెంట్‌లో దారుణంగా మాట్లాడుతూ రాష్ట్రానికి తగిలిన గాయంపై కారం చల్లుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మోదీ మోసాన్ని ఎంపీ జయదేవ్ సూటిగా ఎండగట్టగలిగారన్నారు.

6. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక్కొక్కరి బండారం బయటపెడతానని హెచ్చరిస్తున్నారు సినీ నటి కంగనా రనౌత్‌. తన తప్పు లేకపోయినప్పటికీ ప్రతీ విషయంలో అందరూ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మణికర్ణిక’ ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు సెలబ్రిటీలు రాకపోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వారు వచ్చినా రాకపోయినా తనకు కలిగే ఉపయోగం ఏమీ లేదని అన్నారు.

7. ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించడం ఆ సంస్థ షేర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో టాటా మోటార్స్‌ షేర్లు కుప్పకూలాయి. మార్కెట్‌ ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైన షేర్లు.. కాసేపటికే భారీగా పతనమయ్యాయి. ఒక దశలో 20శాతానికి పైగా నష్టపోయాయి.

8. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ పోటీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. కేరళ నుంచి ఆయన పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ వదంతులను కొట్టిపారేశారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. 

9. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో నిందితుడు డొండురు కిలోను ఒడిశా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒడిశాకు చెందిన పాడువా పోలీసులు నిన్న రాత్రి డొంబురును అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. కొరాపుట్‌ జిల్లా పాడువా అటవీప్రాంతంలో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. నిందితుడిని పోలీసులు ఎన్‌ఐఏ అధికారులకు అప్పగించనున్నారు.

10. టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలదొక్కుకున్నారు. టాప్‌ ఆర్డర్‌ విఫలం కావడంతో ఆ లోటు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ భర్తీ చేస్తున్నారు. క్రీజులో ఉన్న గ్రాండ్‌హోమ్‌(41), రాస్‌ టేలర్‌(18) బౌండరీల మోత మోగిస్తున్నారు. ఇద్దరూ కలిసి 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 13 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది.

టాప్‌ 10 న్యూస్‌ - 9AM

1. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌లతో (ఈవీఎంలు) కచ్చితమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారా, ఓటింగ్‌ను తప్పనిసరి చేస్తే బాగుంటుందా? ఎన్నికల్లో కండబలం, ధన ప్రభావం పెరుగుతున్నాయని భావిస్తున్నారా? గత ఎన్నికల్లో ఓటు వేశారా?ఈ ఎన్నికల్లో మీకు ఓటు ఉందా?.. ఇలా అనేక అంశాలతో దేశవ్యాప్తంగా భారీ సర్వేకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సర్వేను తప్పనిసరి చేసింది. ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా, తెలంగాణ, మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా మొదలు కావాల్సి ఉంది.

2. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ప్రయాణించే ‘ఎయిర్‌ ఇండియా వన్‌’ విమానాలకు రెండు అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థల విక్రయానికి అమెరికా అంగీకరించింది. దీనివల్ల ఆ లోహ విహంగాల భద్రత మరింత కట్టుదిట్టమవుతుంది. ఈ విక్రయం వల్ల భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధం మరింత బలోపేతమవుతుందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్‌’ పేర్కొంది. లార్జ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కౌంటర్‌ మెజర్స్‌ (ఎల్‌ఏఐఆర్‌సీఎం), సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ స్వీట్స్‌ (ఎస్‌పీఎస్‌) అనే ఈ వ్యవస్థలను 19 కోట్ల డాలర్లతో భారత్‌ కొనుగోలు చేయనుంది.

3. ప్రధాని నరేంద్ర మోదీ పిరికిపంద అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శ చేశారు. రఫేల్‌ యుద్ధ విమానాల వ్యవహారం, జాతీయ భద్రతపై తనతో అయిదు నిమిషాల పాటు ముఖాముఖి చర్చలకు రావాలని సవాలు చేశారు. గురువారం దిల్లీలో నిర్వహించిన పార్టీ మైనార్టీ విభాగం సదస్సులో ఆయన ప్రసంగిస్తూ మోదీపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, నాగ్‌పుర్‌ నుంచి పాలన కొనసాగించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశయమని రాహుల్‌ ఆరోపించారు. 

4. భాజపాపైనా, తనపైన విమర్శలు చేయడం పేరుతో కొందరు దేశంపైనే దాడి చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆరోపణలు చేయడం సహజమేనని, కానీ ఆ పేరుతో ప్రతిపక్షాలు దేశాన్నే విమర్శిస్తున్నాయని అన్నారు. గురువారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. దాదాపు 100 నిమిషాల పాటు ప్రసంగించారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి సైన్యం కుట్ర పన్నుతోందంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసి పాపానికి ఒడిగట్టాయని ఆరోపించారు.

5. రానున్న వానాకాలం సీజన్‌లో శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) పరిధిలో 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లను ఆదేశించారు. గురువారం ప్రగతి భవన్‌లో సీఎం ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర సమాచారం తయారు చేయాలి. వాటి నిర్వహణకు నిబంధనలు రూపొందించాలి. ప్రాజెక్టుల నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందో అంచనా వేస్తే ఆ నిధులను బడ్జెట్‌లోనే కేటాయిస్తామని తెలిపారు. 

6. అగ్రిగోల్డ్‌ బాధితులకు తీపికబురు. వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసింది. రూ.10 వేలు, అంతకంటే తక్కువ మొత్తాల్లో డిపాజిట్లు చేసిన వారికి డిపాజిట్‌ సొమ్మును తిరిగి చెల్లించేందుకు వీలుగా ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ద్వారా ఇప్పటివరకూ సమకూరిన రూ.50 కోట్లను కూడా కలిపి మొత్తం రూ.300 కోట్లను న్యాయస్థానం అనుమతితో బాధితులకు చెల్లించనుంది.

7. వైకాపా అధికారం చేపట్టిన నెలరోజుల్లోనే చందా పింఛను పథకాన్ని(సీపీఎస్‌) రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సీపీఎస్‌ రద్దుపై బాబుకు చిత్తశుద్ధి లేదని జగన్‌ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఒప్పంద ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. అవినీతికి తావులేని పారదర్శక విధానానికి పెద్దపీట వేస్తామన్నారు. రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. కడప నగరంలో గురువారం నిర్వహించిన సమర శంఖారావం కార్యక్రమంలో జగన్‌ పాల్గొన్నారు.

8. పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యలో తన ప్రమేయం లేదని ఆయన మేనకోడలు శిఖాచౌదరి అన్నారు. నాలుగు రోజులపాటు తనను కేంద్రంగా చేసుకుని ఎందుకలా ప్రచారం చేశారో అర్థం కావడం లేదన్నారు. మావయ్యను చంపేశారనే షాక్‌లో ఉన్న సమయంలో ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సి రావడం బాధగా ఉందన్నారు. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. 

9. న్యాయస్థానాలు ఆదేశించిన పక్షంలో రాష్ట్రాల్లో సీబీఐ విచారణకు ఆయా రాష్ట్రాల అనుమతి అక్కర్లేదని కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్రాల సాధారణ సమ్మతి కూడా అవసరం లేదని తెలిపింది. కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు గురువారం రాజ్యసభలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ సమాధానమిచ్చారు. ‘రాష్ట్రాల అనుమతితో సీబీఐ విచారణ జరపవచ్చు. రాష్ట్రాలు సాధారణ సమ్మతి ఇవ్వకపోతే విచారణపై ప్రభావం ఉంటుంది. కోర్టులు ఆదేశించిన కేసుల్లో రాష్ట్రాల సాధారణ సమ్మతి లేకపోయినా విచారణ జరపవచ్చు’ అని వివరించారు.

10. టీ20 సిరీస్‌లో బలంగా పుంజుకోవాలనుకుంటున్న భారత జట్టు కీలక పోరుకు సన్నద్ధమైపోయింది. శుక్రవారం జరిగే రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. ఉదయం 11.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. మరోవైపు న్యూజిలాండ్‌-భారత్‌ మహిళల జట్ల మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌(72) చక్కటి ఇన్నింగ్స్‌ ఆడగా.. స్మృతి మందనా(36) ఫర్వాలేదనిపించింది. మిగతా బాటర్లు ఘోరంగా విఫలమవడంతో భారత జట్టు 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్‌ బౌలర్లలో రోస్‌మేరి 2 వికెట్లు తీయగా.. సోఫీ, అమెలియా, కాస్పెరెక్ తలో వికెట్‌ పడగొట్టారు. న్యూజిలాండ్‌ విజయలక్ష్యం 136 పరుగులు.

టాప్‌ 10 న్యూస్‌ – 1PM

1. ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా తెదేపా సీనియర్‌ నేత, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ. షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఇతర నేతలు ఆయన్ను అభినందించి ఛైర్మన్‌ స్థానం వద్దకు తొడ్కొని వెళ్లారు. ఆ తర్వాత షరీఫ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ‌

2. విశ్లేషకుల అంచనాలే నిజమయ్యాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లలో పావుశాతం కోత విధించింది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 6.5శాతం నుంచి 6.25శాతానికి, రివర్స్‌ రెపో రేటును 6శాతానికి, బ్యాంకు రేటును 6.5శాతానికి తగ్గించింది. మార్చి త్రైమాసికంలో ద్రవ్యల్బోణం 2.8శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4శాతంగా ఉండొచ్చని తెలిపింది.

3. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన ఏడుగురు యువకులు కడపలో వైకాపా అధ్యక్షుడు జగన్‌ సభకు కారులో వెళ్తున్నారు. ఓర్వకల్లు పీఎస్‌ వద్దకు రాగానే అదే మార్గంలో వెళ్తున్న లారీ వెనకనుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంచలింగాలకు చెందిన డ్రైవర్‌ రాఘవేంద్ర, నిర్మల్‌నగర్‌కు చెందిన బి. రాము, చిన్ని రాముడు అక్కడికక్కడే మృతి చెందారు. దేవనకొండ మండలం ఈదుల దేవరబండకు చెందిన లింగన్న, నిర్మల్‌నగర్‌కు చెందిన పరశురాం, లక్ష్మన్నలకు గాయాలయ్యాయి.

4. తిరుపతి కోర్టు ప్రాంగణంలో ఓ వైద్యుడిపై యాసిడ్‌ దాడి కలకలం సృష్టించింది. విడాకుల కేసు కోసం కోర్టుకు వచ్చిన ఆదర్శ్‌రెడ్డి అనే వైద్యుడిపై ఓ మహిళ యాసిడ్‌తో దాడి చేసింది. ఆదర్శ్‌రెడ్డి తనను మోసం చేశారంటూ ఆ మహిళ ఆరోపిస్తోంది. ఈ దాడిలో వైద్యుడు స్వల్ప గాయంతో తప్పించుకున్నారు. మహిళను తిరుపతి పశ్చిమ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైద్యుడు ఆదర్శ్‌రెడ్డి వద్ద ఆ మహిళ నర్సుగా పనిచేస్తున్నట్లు సమాచారం. 

5. భారత తొలి ఇంజిన్‌ రహిత రైలు ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఫిబ్రవరి 15న పట్టాలెక్కనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ రైల్వే స్టేషన్‌లో జెండాఊపి ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15 ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుందని అధికారులు వెల్లడించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలును తొలుత ‘ట్రైన్‌18’గా పిలిచారు. ఇటీవల కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’గా దీనికి నామకరణం చేశారు.

6. మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. గురువారం ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న వాద్రాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఈడీ అధికారులు ఆయనను 5.30గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. లండన్‌లోని 12, బ్రైన్‌స్టన్‌ స్క్వేర్‌లో 1.9 మిలియన్‌ పౌండ్లు (రూ.17.62 కోట్లు)తో భవనం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ వాద్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

7. ఛత్తీస్‌గఢ్‌లోని  రాయ్‌పూర్‌లో స్థానిక భాజపా నేతలు నిర్వహించిన కార్యక్రమానికి విలేకరులు హెల్మెట్లు పెట్టుకుని వచ్చారు. ‘ గత శనివారం ఓ మీడియా సమావేశంలో జర్నలిస్టు సుమన్‌ పాండేపై కొందరు భాజపా నేతలు దాడి చేశారు. ఆ ఘటనకు నిరసనగా మేం హెల్మెట్లు పెట్టుకున్నాం. అంతేగాక.. ఒకవేళ వారు(భాజపా నేతలను ఉద్దేశించి) మళ్లీ మాపై దాడి చేసినా హానీ జరగకుండా ఉండేందుకే ఇలా ముందుగా జాగ్రత్త పడ్డాం’ అని విలేకరులు తెలిపారు.

8. చెన్నైలోని పెరుంగుడిలో చెత్త కుండీలో స్వాధీనం చేసుకున్న మృతదేహం భాగాలకు సంబంధించి హతురాలు ఎవరో తెలిసిందని, ఆమెను హతమార్చిన భర్త బాలకృష్ణన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు… చెన్నై పెరుంగుడిలో జనవరి 21వ తేదీన ఉదయం ఓ మహిళ చెయ్యి, కాళ్లు భాగాలు ఉన్నాయి. ఆ మహిళను ఎవరో హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికి అక్కడ పడేసినట్లు తెలిసింది. సమాచారం మేరకు పళ్ళిక్కరణై పోలీసులు విచారణ చేపట్టారు. చెన్నైలో సినిమాల కారణంగా ఏర్పడిన పరిచయాలతో తన భార్య ప్రవర్తన మారినందున పలుమార్లు తాను హెచ్చరించానని తెలిపాడు. విడాకులు ఇస్తానని ఆమె బెదిరించిందని, దీంతో జనవరి 19వ తేదీన ఆమెను నరికి చంపానన్నాడు.

9. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు, వ్యాపారవేత్త అయిన విషగన్‌ వనగమూడితో ఫిబ్రవరి 11న సౌందర్య వివాహం ఘనంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి రజనీ తమిళ మీడియా వర్గాలతో మాట్లాడుతూ.. ‘మా అమ్మాయి పెళ్లి నేపథ్యంలో మొదటి ఆహ్వానాన్ని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడైన తిరునవుక్కరాసర్‌కే ఇచ్చాను. ఎందుకంటే సౌందర్య పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అతనే దగ్గరుండి చూసుకుంటున్నారు’’అని తెలిపారు. 

10. దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 12, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.44గా ఉంది. 

టాప్‌ 10 న్యూస్‌ – 9AM

1. కృష్ణా జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పండగ వాతావరణం నెలకొంది. గురువారం పోర్టు పనులు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా అని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మేకావానిపాలెంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ ప్రాంతంలో వేదిక వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 50 వేల మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక విభాగాన్ని కేటాయించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నందున వారికోసం జిల్లాలో 600కు పైగా బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 

2. పంచాయతీల్లో నిధులను ఏవిధంగా ఖర్చుపెడుతున్నదీ తెలుసుకోవటానికి 25 ఆకస్మిక తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఒక బృందంలో తాను కూడా ఉంటానని చెప్పారు. ఇంటెలిజెన్స్‌ ద్వారా కూడా సమాచారాన్ని తెప్పించుకొంటామని, ఎక్కడ తేడా వచ్చినా సర్పంచి, గ్రామ కార్యదర్శులను సస్పెండ్‌ చేస్తామని సీఎం హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు అయిదురోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు నిపుణులు (రిసోర్సుపర్సన్స్‌)గా ఎంపికైన పంచాయతీరాజ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, సేవా సంస్థల ప్రతినిధులు, రిటైర్డు ఉద్యోగులు, తదితర 350 మందితో ప్రగతిభవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు.

3. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు పేరిట పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రెండు సార్లు కలిసిన కేసీఆర్‌… కోల్‌కతాలో సీబీఐ దాడులను ఎందుకు ఖండించలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సహా ఈ దాడులను దేశంలోని నాయకులందరూ ఖండించినప్పటికీ కేసీఆర్‌, జగన్‌లు ఆ పనిచేయలేదని అన్నారు. మోదీకి భజన చేయడమే జగన్‌, కేసీఆర్‌ పనిగా ఉందన్నారు. దేశాన్ని భ్రష్టుపట్టించేందుకే ఈ ముగ్గురు మోదీలతో మోదీ ఫ్రంట్‌ ఏర్పాటైందని విమర్శించారు. బుధవారం ఉదయం నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో, ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు.

4. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 45 ఏళ్లకే పింఛను ఇస్తాం. అవ్వా తాతలకు రూ.2 వేలు నుంచి దశల వారీగా ఆ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచుతాం. ప్రతి రైతుకు మే నెల రాగానే రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తాం. ఒక్కో ఇంటికి ఏడాదికి రూ.15 వేల వరకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తాం. ఈ విషయాలను మీరు ప్రజలకు వివరించండి…’ అని వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసే క్రమంలో జగన్‌ బుధవారం తిరుపతి సమీపంలోని రేణిగుంట యోగానంద ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన బూత్‌ కమిటీ సమన్వయకర్తల సమర శంఖారావం సభలో ప్రసంగించారు. 

5. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రతువులో భాగంగా పలు సంస్కరణల్ని అమలు చేస్తున్న రాజధాని పోలీసులు తాజాగా ఆటోల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే క్యాబ్‌లకు పోలీస్‌ రిజిస్ట్రేషన్లను చేసినా.. మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆటోల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అమలు చేయబోతున్నారు. ఒక ప్రయాణికుడు ఆటోలో ఎక్కిన తర్వాత గమ్యస్థానం చేరేవరకు ప్రతిక్షణం ఆటో కదలికల్ని పసిగట్టే అవకాశం కలగనుంది. దీనికితోడు ప్రయాణికులు ఆటోలో ఏదైనా పోగొట్టుకున్నా.. ఆటోవాలా ఏదైనా అమర్యాదగా ప్రవర్తించినా.. మహిళా ప్రయాణికులతో అసభ్యంగా వ్యవహరించిన క్షణాల్లో పోలీసులకు సమాచారం అందించే పరిజ్ఞానం ఇమిడి ఉండటంతో సురక్షిత ప్రయాణానికి మార్గం సుగమం కానుంది.

6. తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) ప్రక్రియ విద్యార్థులకు మరింత సౌకర్యంగా మారనుంది. ప్రవేశాల పక్రియ ముగిసే చివరి దశ వరకు అంతా ఆన్‌లైన్‌ విధానంలోనే జరగనుంది. ఈ విద్యా సంవత్సరంలో తలెత్తిన సమస్యలు, ఇబ్బందులను బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ అధికారులు… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహాయ కేంద్రాల నిర్వాహకులతో సమావేశమై సమీక్షించారు. ప్రైవేట్‌ కళాశాలల్లో యాజమాన్య కోటా ఇవ్వాలా? లేక తక్షణ ప్రవేశాల (స్పాట్‌)కు అవకాశం ఇవ్వాలా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

7. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (పీఏపీఎఫ్‌లలో) మొత్తం 76,578 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు హోంశాఖ వెల్లడించింది. ఇందులో 7,646 పోస్టులను మహిళలకు కేటాయించినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.54,953 కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులను సిబ్బంది ఎంపిక సంఘం (ఎస్‌ఎస్‌సీ) ద్వారా భర్తీ చేస్తారు. సీఆర్‌పీఎఫ్‌లో 21,566; బీఎస్‌ఎఫ్‌లో 16,984; ఎస్‌ఎస్‌బీలో 8,546; ఐటీబీపీలో 4,126; అస్సాం రైఫిల్స్‌లో 3,076 పోస్టులు చొప్పున ఈ పోస్టులున్నాయి.

8. ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించినప్పుడు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)తో ఆధార్‌ను అనుసంధానం చేయడం చట్టపరంగా తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని 139ఏఏ సెక్షన్‌ చెల్లుబాటవుతుందని గతంలో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వీటిని అనుసంధానం చేయక తప్పదని జస్టిస్‌ ఎ.కె.సిక్రి, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. 

9. పాకిస్థాన్‌లో శక్తిమంతమైన వ్యవస్థగా పేరొందిన సైన్యానికి ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీవ్ర శరాఘాతం ఎదురైంది. సైనిక బలగాల సభ్యులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని పాక్‌ సుప్రీంకోర్టు నిషేధించింది. ఐఎస్‌ఐ వంటి ప్రభుత్వ సంస్థలు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని స్పష్టం చేసింది. విద్వేషం, తీవ్రవాదం, ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

10. ఓ కెనడా వ్యాపారవేత్త హఠాన్మరణం కారణంగా క్రిప్టో కరెన్సీ రూపంలో ఉన్న సొమ్ము భారీ మొత్తంలో ఇరుక్కుపోయింది. క్వాడ్రిగా అనే సంస్థలో వినియోగదారులకు చెందిన రూ.1037 కోట్ల విలువైన బిట్‌ కాయిన్లు, ఇతర డిజిటల్‌ ఆస్తులు ఆచూకీ లేక గల్లంతయ్యాయి. తిరిగి వారికి చెల్లింపులు జరిపే మార్గం లేక ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. క్వాడ్రిగా సీఈఓ జెరాల్డ్‌ కాటన్‌ (30) ఇటీవల భారత్‌ పర్యటనకు వచ్చి అనూహ్యంగా మృత్యువాత పడ్డారు. క్వాడ్రిగా క్రిప్టో కరెన్సీ నిల్వలు ‘కోల్డ్‌ వ్యాలెట్స్‌’ అనే ఆఫ్‌లైన్‌ ఖాతాల్లో స్టోర్‌ చేసి ఉన్నాయి. హ్యాకింగ్‌ మప్పు లేకుండా వీటిని ఇలా నిర్వహిస్తున్నారు. ఈ ఖాతాలను వినియోగించాలంటే పాస్‌వర్డ్‌ తప్పనిసరి. అది జెరాల్డ్‌కు మాత్రమే తెలుసు. జెరాల్డ్‌ పాస్‌వర్డ్‌ను ఎక్కడా రాసి కూడా పెట్టలేదని ఆయన భార్య జెన్నీఫర్‌ రాబర్స్ట్‌న్‌ కోర్టుకు తెలిపారు. సమస్యను పరిష్కరించుకునేందుకు క్వాడ్రిగాకు కోర్టు 30 రోజుల పాటు సమయం ఇచ్చింది.

1. ప్రధాని నరేంద్రమోదీ, నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. బుధవారం ఒడిశాలోని భవానిపట్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ‘ప్రధాని మోదీ, నవీన్‌ పట్నాయక్‌ తమ సంపన్న స్నేహితుల కోసమే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం చారిత్రక నిర్ణయం తీసుకున్నామని బడ్జెట్‌ ప్రసంగంలో భాజపా చెప్పుకొంది. కానీ వాళ్లు రైతు కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఇస్తుంది రూ.3.5 మాత్రమే. అదే సమయంలో కార్పొరేట్‌ కంపెనీలకు రూ.3.5లక్షల కోట్లు ఇచ్చారని విమర్శించారు. 

2. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైకాపా నేత పోలీసులకు లంచం ఇవ్వజూపిన  ఘటన కలకలం రేపింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నేతలు ప్రలోభాల పర్వానికి తెరలేపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై  మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు ఎస్‌ఐలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా వెంకటరామారావుతో పాటు వసంత కృష్ణప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

3. ఇంటర్‌ విద్యార్థినిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది భరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు మండల‌ డీసీపీ రమేష్‌ కేసు వివరాలను  మీడియాకు వెల్లడించారు. ‘‘విద్యార్థిని తనతో మాట్లాడటం లేదని ఈరోజు ఉదయం 8.45గంటలకు భరత్‌ అనే యువకుడు  ఆమెను అటకాయించి కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు యశోదా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. నిందితుడు భరత్‌ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మూసీ నది ఒడ్డున పట్టుకున్నాం. నిందితుడిపై హత్యాయత్నం, ఫోక్సో కింద కేసులు పెడతాం’’ అని డీసీపీ వెల్లడించారు. భరత్‌ను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

4. దర్శకుడు చెలియన్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘టూలెట్‌’. సంతోష్‌ శ్రీరామ్‌, సుశీల, ఆధిరా పాండిలక్ష్మి, ధరుణ్‌ బాలా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, కథను చెలియన్‌ అందించారు. ఇంకా విడుదల కాని ఈ సినిమా ఇప్పటి వరకు 80 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్‌ అయ్యింది. 26 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. చెన్నైలో అద్దె ఇంటిని వెతకడానికి ఓ కుటుంబం పడే కష్టాల్ని ఈ సినిమాలో దర్శకుడు ఎంతో సహజంగా చూపించారు.

5. మలయాళ నటి ప్రియా వారియర్‌ నటించిన ‘లవర్స్‌ డే’ సినిమా టీజర్‌ విడుదలైంది. రొమాంటిక్‌గా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా!.. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మన్నావు.. అది మన మధ్య.. మన ఇద్దరికీ ఇంత త్వరగా సెట్‌ అవుతుందని నేను అనుకోలేదు..’ అంటూ ప్రియా వారియర్‌, రోషన్‌ల మధ్య సాగే సన్నివేశాన్ని టీజర్‌లో చూపించారు. ఇద్దరి నటన చూడటానికి చక్కగా అనిపించింది. షాన్‌ రెహమాన్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.

6. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ అనుకోకుండా తప్పుడు సందేశం పంపి ఎన్నో సార్లు నాలుక కరచుకున్నారు కదా..!తప్పుగా టైప్‌ చేసి బాధపడ్డారు కదా.. వాట్సాప్‌లో మాదిరిగా ఇందులోనూ డిలిట్‌ చేసే అవకాశం ఉంటే బాగుండేదని అనుకున్నారు కదా.. అలాంటి వారి కోసమే ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. పంపిన సందేశాన్ని తొలగించడం కోసం ‘డిలిట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌’ అనే సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

7. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి, పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాపై విచారణను వేగంగా పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేశామని ఈడీ వెల్లడించింది. మాల్యాను భారత్‌కు అప్పగించే ప్రక్రియపై యూకే హోం సెక్రటరీ సోమవారం సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. మాల్యాను యూకే నుంచి తీసుకురాగానే, అతడిని ఉంచడానికి ఆర్థర్‌ రోడ్ జైల్లో ఓ గదిని సిద్ధం చేశామని ఈడీ వెల్లడించింది. 

8. బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ఆయన్ను చూసి అభిమానులు సంబరపడుతుంటారు. అయితే ఈసారి రణ్‌వీర్‌ తన అత్యుత్సాహం వల్ల నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు. రణ్‌వీర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గల్లీబాయ్‌’. ఆలియా భట్‌ కథానాయిక. జోయా అక్తర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రణ్‌వీర్‌ పాపులర్‌ గాయకుడు కావాలని కలలు కనే ‘గల్లీబాయ్’‌గా కనిపించబోతున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది.

9. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో కొంతమంది దుండగులు ఓ హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. ఆలయంలోని పవిత్ర గ్రంథాలు, విగ్రహాలకు నిప్పుపెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌.. వెంటనే విచారణకు ఆదేశించారు. ‘‘ ఆలయం కూల్చివేత ఘటనపై సింధ్‌ ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ చర్య ఖురాన్‌కు వ్యతిరేకం’’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విట్టర్‌ వేదికగా యంత్రాంగాన్ని ఆదేశించారు.

10. న్యూజిలాండ్‌తో తొలి వన్డే కఠినంగా సాగిందని టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ అన్నాడు. మూడు విభాగాల్లోనూ తమ జట్టు విఫలమైందని అంగీకరించాడు. కివీస్‌లో మైదానాలు చిన్నవే అయినా 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం సులభం కాదని తెలుసన్నాడు. తొలి పోరులో ఆతిథ్య జట్టు 220 పరుగుల లక్ష్యం నిర్దేశించగా భారత్‌ 139 పరుగులకే ఆలౌటైంది. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా విఫలమయ్యారు. ధోనీ (39) టాప్‌ స్కోరర్‌. విజయ్‌ శంకర్‌ ఫర్వాలేదనిపించాడు.

రాష్ట్రంలో 12మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 12 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ముకేష్‌కుమార్‌ మీనాను ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా, పి.లక్ష్మీనరసింహంను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా, శ్రీనివాస్‌ సి.నరేశ్‌ను గనుల శాఖ కార్యదర్శిగా, బి.శ్రీధర్‌ను పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మహమ్మద్‌ ఇంతియాజ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్‌గా, ఎం.రామారావును శ్రీకాకుళం కలెక్టర్‌గా, కె.ధనంజయరెడ్డిని పర్యాటక అభివృద్ధి సంస్థ సీఈవోగా,కృతికా శుక్లాను కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్‌గా, కె.విజయను సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శిగా, హిమాంశు శుక్లాను గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా నియమిస్తూ బదిలీ చేశారు.  

ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ
కె.వి.వి.గోపాలరావును ఏపీఎస్పీ బెటాలియన్‌ ఐజీగా, గజరావు భూపాల్‌ను మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా, ఆర్కే మీనాను గుంటూరు రేంజ్‌ ఐజీగా బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

శాసనసభలో ఆరు బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆరు బిల్లులు ప్రవేశపెట్టింది. ఏపీ ప్రైవేటు వర్శిటీల స్థాపన.. క్రమబద్ధీకరణ సవరణ బిల్లు, ప్రపంచ స్థాయి డిజిటల్‌ విద్యాబోధనకు సంబంధించిన బిల్లును మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రవేశపెట్టారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు నాలుగు బిల్లులను ప్రవేశపెట్టారు. బీసీ ఉప ప్రణాళిక బిల్లు, ఈబీసీలో కాపులకు ఉద్యోగ.. విద్యా సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్‌ బిల్లు, కాపులు మినహా ఇతర అగ్రవర్ణాల పేదలకు సంబంధించిన మరో బిల్లు, వ్యాట్‌ సవరణ బిల్లు అందులో ఉన్నాయి. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ నివేదికను సభలో భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ప్రవేశపెట్టారు. 

తాజా వార్త

      Rate This


1. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 11వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. దాని వల్ల రాజధాని నగరాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

2. శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంలో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. తీర్పును నైతిక విజయంగా అభివర్ణించారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, సుప్రీం తీర్పును తాము అనుసరిస్తామని దీదీ పేర్కొన్నారు.

3. ఎరువులు, విత్తనాలు దొరక్క 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయారని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై శాసనసభలో చేపట్టిన లఘుచర్చలో సీఎం మాట్లాడారు. దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టిన ఘనత తెదేపా ప్రభుత్వానిదని చెప్పారు. 

4. అమెరికాలో భారత విద్యార్థుల అరెస్టుపై ప్రభుత్వం దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి అభ్యంతర పత్రం(డెమార్ష్‌) జారీ చేయడంపై అక్కడి ప్రభుత్వం స్పందించింది.  ‘‘ఈ విషయంలో అరెస్టయిన విద్యార్థులందరికీ తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసు. అక్రమంగా అమెరికాలో ఉండాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారు’’ అని అమెరికాకు చెందిన ఓ అధికార ప్రతినిధి ఆరోపిస్తున్నారు.

5. పశ్చిమ బెంగాల్‌లో కేంద్రం చర్యను వైకాపా అధ్యక్షుడు జగన్, తెరాస అధినేత కేసీఆర్ తప్ప అంతా ఖండించారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అభివృద్ధి గురించి మాట్లాడలేకే కులాల మధ్య జగన్‌ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం కోసం పాటు పడే ఏకైక పార్టీ తెదేపానేనని సీఎం స్పష్టంచేశారు. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

6. సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త, కోస్టల్‌బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ కొలిక్కి వస్తోంది. విచారణ నిమిత్తం ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డి, జయరాం మేనకోడలు శిఖాచౌదరిని పోలీసులు కృష్ణా జిల్లా నందిగామ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కేసు విచారణ విషయాలపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. రాకేష్‌రెడ్డి, శిఖాచౌదరి ఇద్దర్నీ నందిగామ పోలీస్‌స్టేషన్‌లోనే విచారిస్తున్నట్లు సమాచారం. 

7. సీబీఐ అధికారుల తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష మంగళవారం కూడా కొనసాగుతోంది.  ధర్నా వేదిక వద్ద ఉన్న టీఎంసీ నేతలను ఉద్దేశిస్తూ మమతాబెనర్జీ ప్రసంగించారు. ‘ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఓ నిజాయతీపరుడిని పట్టుకుని మోసగాడు అంటే నేను చూస్తూ ఊరుకోను. వారికి అండగా నిలుస్తా. అందుకోసం నా ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా సరే’ అని దీదీ అన్నారు. 

8. శారదా కుంభకోణం దర్యాప్తుపై సుప్రీంకోర్టులో నేడు వాడీవేడీ చర్చ జరిగింది. ఈ దర్యాప్తునకు కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సహకరించడం లేదని, అంతేగాక సాక్ష్యాలను మరుగున పరచాలని చూస్తున్నారని ఆరోపిస్తూ సీబీఐ నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం రాజీవ్‌ కుమార్‌ను విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

9. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ 8 అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగి ఏడుగురు మృతిచెందారు. పారిస్‌లోని 16వ అరోన్‌డిసెమెంట్‌లో గల రు ఎర్లాంగర్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రు ఎర్లాంగర్‌లోని ఓ నివాస భవనంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

10. దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సెన్సెక్స్‌ 71 పాయింట్ల నష్టంతో 36,654 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 10,942 వద్ద ట్రేడవుతున్నాయి. 

వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 8వేల కోట్లు

అమరావతి: ఏపీ శాసనసభలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు..

* ఆర్థికశాఖకు రూ. 51,841.69 కోట్లు

* సాధారణ పరిపాలనకు రూ. 1177.56 కోట్లు

* వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంకు రూ. 10,032.15 కోట్లు

* హోంశాఖకు రూ. 6397.94 కోట్లు

* గృహ నిర్మాణం రూ. 4079.10 కోట్లు

* జలవనరుల శాఖకు రూ. 16,852.27 కోట్లు

* విద్యుత్‌, మౌలిక వనరులకు రూ. 5,473.83 కోట్లు

* ఆహార, పౌరసరఫరాల శాఖకు రూ. 3763.42 కోట్లు

* ఉన్నత విద్యాశాఖకు రూ. 3171.63 కోట్లు

* వెనకబడిన వర్గాల కార్పొరేషన్లకు రూ. 3వేల కోట్లు

* వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 8,242.64 కోట్లు

* అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక రంగాలకు రూ. 491.93 కోట్లు

* వ్యవసాయ మార్కెటింగ్‌, కో ఆపరేటివ్‌కు రూ. 12,732.97 కోట్లు

* పాడి పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ. 2,030.87కోట్లు

* పరిశ్రమలు, వాణిజ్యంకు రూ. 411.92 కోట్లు

* ఐటీ, కమ్యూనికేషన్స్‌కు రూ. 1006.81 కోట్లు